(పల్లవి)
భలే భలే మా అన్నయ్య! మనసే చల్లని వెన్నయ్యా....... //2//
అమ్మలో సగము నాన్నలో సగము కలిపి చేసెనా బ్రహ్మయ్య,
మా ఇల్లే రేపల్లెగ ప్రేమను చల్లిన ముద్దుల కన్నయ్యా !.....................// భలే భలే //
(చ-1)
అమ్మా నాన్నా అపురూపం....ప్రేమకు తానే ప్రతిరూపం,
ఆ మోముకు తెలియదు కోపం...పెదవుల నవ్వే నిక్షేపం!
చిట్టి తమ్ములకు పట్టు కొమ్మయై వెలుగునిచ్చు వెచ్చని దీపం,
స్వార్థమంటె తెలియదు పాపం, మా మంచికై ఆతని పరితాపం!
ఏ జన్మలో చేసిన ఏ పుణ్యం...ఆ...ఆ...ఆ.. //2 //
ఈ అన్నతో సోదర బాంధవ్యం !...................................................// భలే భలే //
(చ-2)
రావమ్మా ఓ వదినమ్మా....కోవెల మెట్టిన పుత్తడి బొమ్మా,
మా రాముడు వలచిన సీతమ్మా...ఈ లక్ష్మణులకు ఇంకొక అమ్మ!
ఈ మెత్త మనసు గల అత్త మామలకు కొత్త కూతురివి నీవమ్మా,
కలకలలాడగ మా బృందావని కిలకిలలాడవే ఓ చిలకమ్మా!
ప్రేమలు విరబూసిన ఈ కొమ్మా...ఆ...అ...ఆ... //2 //
వాలగ ఏ నోములు నోచితివమ్మా ! .............................................//భలే భలే//
(ముగింపు పల్లవి)
అన్నా వదినలు అన్యోన్యం, సేవింపగ మేమిక ధన్యం.. ..//2 //
కల కాలం విలసిల్లాలి చల్లగ అల్లగ మీ దాంపత్యం,
కలతలు ఎఱుగక మమతలు కురియగ మా లోగిలి విరిసెను స్వర్గం !!
*************************************************
No comments:
Post a Comment