మా ఇంటి లోగిలిలో వెన్నెలలు కురిపించు ముద్దు చందమామ మా పెద్దమామ,
తన కంటిపాప వలె మము చంటిపాపలను వెన్నంటి నడిపించు మేనమామ !
అనురాగమనుబంధమందరికి పంచేను, అతని మారునామమేమో 'ప్రేమ',
ఆప్యాయతామమత సమ్మిళితమౌ చరిత, తన నడత క్షమతకది చిరునామా !
కోటవారి బంధుకోటి ధన్యంబవగ వెలసినటి ఆ దైవ అవతారమా,
సాటిలేని మేటి సుగుణధాముని ఋణము ఏనాటికైన యది తీర్చతరమా !!
తోటి తమ్ములనొక్కతాటిపై నడిపించి మంచి సఖ్యతనెపుడు పెంచినాడు,
ఆడపడుచులు చల్ల నీడ నడుచుటెకోరి వారి హితమును సతతమెంచినాడు !
మాతపితరులు ధరణిఁ తిరుగాడు సురవరులు, వారి సేవాతురతఁ సలిపినాడు,
కలిసిమెలయుట యందె సుఖమువెలయుట తెలిసి బంధుమైత్రిని నెలకొలిపినాడు!
కలనైన కీడెపుడు తలపోసి ఎఱుగడు, మేల్కొనుచునే మేలు తలయువాడు,
అరులెవరు లేరు ఇలఁ అజాతశత్రుడు, ఎల్లరితొ చెలిమిగా కలియువాడు !!
భావిపౌరుల మలచు మహత్కార్యము శిరోధార్యముగ తలచి ఆచార్యుడయ్యె,
బాలజాగృతి సేయ జ్ఞానవిగ్రహమాయె, ఉగ్రభానుడై నిశిని నిగ్రహించె !
చేతిబెత్తమునెత్తడుత్తుత్తిగానైన, ఉత్తమమౌ నవనీత చిత్తుడాయె,
సుతిమెత్తనగు సున్నితోక్తులచే అదలించు, ఏ నెత్తినేనాడు మొత్తడాయె !
విద్యాలయములెన్నో విద్యుల్లతలవోలె ఉధ్దరింపాద్యంతముద్యమించె,
విద్యమ్మకుద్యోగనైవేద్యమిడి నేడు బాధ్యతల విరమించి విశ్రమించె !!
ఘనమైన సన్మానముల వాన నీపైన కురిసేటి నేటి వీడ్కోలు వేళ,
వినయమున ప్రణమిల్లి చరణములకర్పింతు ప్రణుతిగా ఈ వర్ణపూలమాల !
ఎంతఎదిగినగాని చెంత ఒదిగుండేము నీవేగ మాకండదండవయ్యా,
శాంతిసౌఖ్యము నిండ, దైవచింతన పండ, నిండుగా నూరేళ్ళు ఉండవయ్యా !!
****************************************************
Sunday, June 29, 2008
Subscribe to:
Posts (Atom)