ముందుమాట

ముందుమాట

"పలికెంచెడివాడు రామభద్రుడట" అని పోతన వంటి మహానుభావుడే వినమ్రతతో పలికెను. సృజియించే శక్తి భగవంతునికే ఉన్నది. జీవులు నిమిత్తమాత్రులు. ప్రతిభ ఎవరిచే ప్రదర్శితమైనా, నిజమునకు అది వారిచే ప్రకటితమయిన భగవద్విభూతి గా తెలుసుకొనవలెను.ఏ కళాకారుని యొక్క కళ గాని, శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణ గాని వారిద్వారా ప్రకటితమయినవే గాని వారి సృష్టి గాదు. "మత్తస్మృతిజ్ఞానమపోహనం చ" అని శ్రీ కృష్ణభగవానుని గీతోక్తి. కావునా, నా రచనలకు కర్త భగవానుడే అని సత్యమును ముందుగనే ప్రకటించుచున్నాడను.
"చిలుకపలుకులొలుకు రీతి పలికింతువు నా చేతను,
చిలుకగ మరి కృతిపై కృతి నడిపింతువు నా చేతిని,
తలపులు మొలుపుచు నా మతి సృజియింపనీవె ప్రతి కైతను,
తెలిసియు సంగతి శ్రీపతి, నే కర్తగనెటు తలతును?"


*************

Sunday, October 23, 2011

An appeal to Goddess for the relief of my cousin's suffering

బాలాత్రిపురసుందరీ....మా బాలా వేదన తీర్చవే... //2//
లీలాకేళి ముజ్జగాల సుపాలించే - (2) మముగన్నతల్లీ మాపాలికల్పవల్లి.. //బాలా//

తరాల తరాల మా పరివారమెల్ల - (2) పరాశక్తి స్థిరభక్తి నిను కొల్చినామె,
ఇహాన పరాన వరాలిచ్చి దఱిజేర్చు, ఆధారమీవని నెఱనమ్మినామె ;
మొఱాలించవే... (2) మరాళీ మాధవుచెల్లి //బాలా//

ముల్లోకజననీ ముక్కంటి ముద్దులరాణి --(2) మీ చిన్నిపాపలము దయచూడుమమ్మా,
భవానీ శివానీ భవ్యఫలదాయిని, మా చిన్న పాపముల మదినెంచకమ్మా;
కృపన్ చూడవే.... (2) తపించేము ప్రణమిల్లి //బాలా//

You can download the mp3 audio of this song at this link:
http://www.filefactory.com/file/ce9b15e/n/Baalaatripurasundaree.(mahesh)..mp3

Wednesday, October 14, 2009

A Song on the eve of DIWALI

ప|| వచ్చింది వచ్చింది దీపావళి
వెచ్చవెచ్చంగ వెలుగంగ ప్రతి ముంగిలి ||వచ్చింది||

అ.ప|| దీపాల వరుసట దానర్థము...(2)
పాపతిమిరాల తరుముటే పరమార్థము.. ||వచ్చింది||

చ-1||
లోకాల పీడించె ఆ నరకుడు-ఆ శోకాల తీర్చంగ శ్రీకృష్ణుడు

అమావాస నిశినాడె ఆ దనుజుని-సత్యభామా సమేతుండై వధియించెను
చింతల చీకట్లు తొలగాయిలే...(2)
దీపకాంతులే వాకిట్లో వెలిగాయిలే... ||వచ్చింది||

చ-2||
ప్రతి ఇంట పచ్చపచ్చని తోరణం-సతులు కొలిచేరు శ్రీ లక్ష్మి శుభకారణం

చేసేరు కొత్త వస్త్రధారణం- ఆరగించేరు పిండివంటల భోజనం
చెలరేగు బాణాసంచా సంబరం...(2)
పొంగి అలరంగ రంగులతో ఆ అంబరం... ||వచ్చింది||

Sunday, June 29, 2008

My tribute to our maternal uncle on the eve of his retirement.

మా ఇంటి లోగిలిలో వెన్నెలలు కురిపించు ముద్దు చందమామ మా పెద్దమామ,
తన కంటిపాప వలె మము చంటిపాపలను వెన్నంటి నడిపించు మేనమామ !
అనురాగమనుబంధమందరికి పంచేను, అతని మారునామమేమో 'ప్రేమ',
ఆప్యాయతామమత సమ్మిళితమౌ చరిత, తన నడత క్షమతకది చిరునామా !
కోటవారి బంధుకోటి ధన్యంబవగ వెలసినటి ఆ దైవ అవతారమా,
సాటిలేని మేటి సుగుణధాముని ఋణము ఏనాటికైన యది తీర్చతరమా !!

తోటి తమ్ములనొక్కతాటిపై నడిపించి మంచి సఖ్యతనెపుడు పెంచినాడు,
ఆడపడుచులు చల్ల నీడ నడుచుటెకోరి వారి హితమును సతతమెంచినాడు !
మాతపితరులు ధరణిఁ తిరుగాడు సురవరులు, వారి సేవాతురతఁ సలిపినాడు,
కలిసిమెలయుట యందె సుఖమువెలయుట తెలిసి బంధుమైత్రిని నెలకొలిపినాడు!
కలనైన కీడెపుడు తలపోసి ఎఱుగడు, మేల్కొనుచునే మేలు తలయువాడు,
అరులెవరు లేరు ఇలఁ అజాతశత్రుడు, ఎల్లరితొ చెలిమిగా కలియువాడు !!

భావిపౌరుల మలచు మహత్కార్యము శిరోధార్యముగ తలచి ఆచార్యుడయ్యె,
బాలజాగృతి సేయ జ్ఞానవిగ్రహమాయె, ఉగ్రభానుడై నిశిని నిగ్రహించె !
చేతిబెత్తమునెత్తడుత్తుత్తిగానైన, ఉత్తమమౌ నవనీత చిత్తుడాయె,
సుతిమెత్తనగు సున్నితోక్తులచే అదలించు, ఏ నెత్తినేనాడు మొత్తడాయె !
విద్యాలయములెన్నో విద్యుల్లతలవోలె ఉధ్దరింపాద్యంతముద్యమించె,
విద్యమ్మకుద్యోగనైవేద్యమిడి నేడు బాధ్యతల విరమించి విశ్రమించె !!

ఘనమైన సన్మానముల వాన నీపైన కురిసేటి నేటి వీడ్కోలు వేళ,
వినయమున ప్రణమిల్లి చరణములకర్పింతు ప్రణుతిగా ఈ వర్ణపూలమాల !
ఎంతఎదిగినగాని చెంత ఒదిగుండేము నీవేగ మాకండదండవయ్యా,
శాంతిసౌఖ్యము నిండ, దైవచింతన పండ, నిండుగా నూరేళ్ళు ఉండవయ్యా !!
****************************************************

Sunday, August 26, 2007

Song - A mature mind's prayer to Krishna!

(పల్లవి)
శ్యామ సుందరా...దేవా...ప్రేమ మందిరా ! //2//

కరుణ చిందు నీ రూపమె నిలిపి కనుల ముందర,
స్మరణ చేతు నీ నామమె నిండు మనమునందుర!

మాయ పొరల...మనసు మరలె...ఏమి వేడుకొందురా!!.......//శ్యామ సుందరా//


(చరణం-1)
ఇహము మరిగి విచలమాయె, మదియె నిన్ను మరచెరా !
అహము పెరిగి దేహ సుఖమె, పరమమనుచు తలచెరా !
మిథ్యయైన బంధములను తగిలి చింతనొందెరా!
సత్యమేదొ తెలియలేక స్వప్నమందు వెదికెరా!

నిత్యమైన... ఆత్మ ఉనికి... మరువ శాంతి ఎందురా!!........//శ్యామ సుందరా//


(చరణం-2)
తమస నిశము సమసి పోగ, సత్వ దీప్తి వెలుపరా !
విషయ వాంఛ నిలువు త్రుంచె, జ్ఞాన ప్రాప్తి నొసగరా !
సిరుల ఎఱల మరులుగొల్పు మాయలింక చాలురా !
ఎదల కలుపు తొలపి నీదు తలపు స్థిరము నిలుపరా!

ముక్తి కోరి....భక్తి కొలుతు....నాదు పూజలందరా!!..........//శ్యామ సుందరా//


********************************************************

Teasing song at my brother's marriage feast!

Marriage celebration means a lot of fun. It's been a jovial custom to sing funny teasing songs about the feast offered by the other party. At my brother's marriage, I made this tuneful funny song taunting the bridal side at the feast.

(పల్లవి)
విందుకు రమ్మని తొందర చేస్తిరి సందడిగా వియ్యాలోరూ,
చూతములెమ్మని చేరగ విస్తరి, కందెను అయ్యో మా నోరూ ! ....... //2//

బంధువులంతా బేజారూ - చిందులు తొక్కుతు పరారు !...... //2//


(చ-1)
అన్నము చూస్తే మన్నులా జారె, నిన్నటి మొన్నటి వంటమ్మో!
కూరలొ కాస్తా కారము మస్తుగ కూరి పోస్తినారు, మంటమ్మో!
పప్పు చూడ అసలుప్పు జాడ లేదు, చప్ప కూడు తప్పదంటారా!
చారు సాంబారుల తీరు చూస్తే మీరు బెదిరి పారిపోకుంటారా!

పెళ్ళి భోజనము అంటారా - తుళ్ళి పడ్డ జనము వింటారా ? //2//...............//విందుకు//



(చ-2)
పచ్చడంటు తెచ్చె చచ్చు ఆవకాయ, మచ్చుకైనా పెచ్చు చూశారా!
చింత పులుపు ఎంత కలిపారో, ఏం వింత పులిహారో, నీ నోరు పూసేరా!
కొరకరాని బండ, గోరు దిగని ఉండ, బూరె అంటె మండదా ఒళ్ళు !
పెరుగు అంటు పాల విరుగు పోసినారు, తిరిగె కళ్ళు, కారె కన్నీళ్ళు !

తింటేను ఇట్టి పదార్థాలు - జరిగేనో ఎట్టి అనర్థాలు !! //2//..........................//విందుకు//

***********************************************************

Saturday, August 25, 2007

Wishes on shifting to a new house!

This was the poem compiled as a way of wishing my family on the occasion of their shifting to a new house. The beauty is the impressive use of rhythmic words (praasa), without compromising precision of portrayal. It's a situational poem. Perhaps, a little explanation of the circumstances is necessary for the outsiders to enjoy the rich meaning. The explanation is given at the end.


నూతన గృహమున చేరిన శుభదిన విశేష ఫలమున,
చేతన నిండెను జనగణమందరి జీవన మందున!

యాతన మరువగ నాయన మనమున కూరును స్వాంతన,
కోతిని తెమ్మన తెచ్చెడి ఘనులగు తనయుల చెంతన!

వేతన మెదుగును గగనము దూసిన పతాక రీతిన,
భ్రాతల పనితనమొప్పగ దినదిన ప్రవర్ధగతిన!

మాతనువలె అత్తను గను సనాతన చింతన - ఎద
లోతున పాతిన వదినకు జననితో చక్కని పొంతన!

ప్రీతిన చన పరివారము అనుదినమొకరికై ఒకరన, శాంతిని-
కేతన మాయెను మన ఈ మమతల ప్రాంగణ!

కైతన అంతట నిండగ నిజ జన సుఖ అభిలాషణ,
రాతన సుమధుర భాషణ పలికెనీ అభినవ పోతన !!

The first stanza refers to the enthusiastic joy of moving to a new place. My brother's marriage having been successfully celebrated recently, my father is a happy man & letting his hair down, with peaceful mind. He has now nothing to worry, as his accomplished, worthy sons are at his service. It's wished that both my brothers who have gained foothold in their careers would further excel, bringing prosperity. Vadina(sister-in-law), who has been a new member into the family, also hailed from a house of traditional values and so is hoped to strike a good rapport with my mom. With all the members of the family living amicably with mutual affection, our house would become a temple of peace.
In the closing stanza, the author calls himself "modern Pothana" who compiled this sweet-worded poem replete with good wishes for his family.
*********************************************************************

Song at my eldest brother's marriage!

This song was composed on the occasion of my eldest brother's marriage.



(పల్లవి)

భలే భలే మా అన్నయ్య! మనసే చల్లని వెన్నయ్యా....... //2//

అమ్మలో సగము నాన్నలో సగము కలిపి చేసెనా బ్రహ్మయ్య,
మా ఇల్లే రేపల్లెగ ప్రేమను చల్లిన ముద్దుల కన్నయ్యా !.....................// భలే భలే //


(చ-1)

అమ్మా నాన్నా అపురూపం....ప్రేమకు తానే ప్రతిరూపం,
ఆ మోముకు తెలియదు కోపం...పెదవుల నవ్వే నిక్షేపం!
చిట్టి తమ్ములకు పట్టు కొమ్మయై వెలుగునిచ్చు వెచ్చని దీపం,
స్వార్థమంటె తెలియదు పాపం, మా మంచికై ఆతని పరితాపం!
ఏ జన్మలో చేసిన ఏ పుణ్యం...ఆ...ఆ...ఆ.. //2 //
ఈ అన్నతో సోదర బాంధవ్యం !...................................................// భలే భలే //

(చ-2)

రావమ్మా ఓ వదినమ్మా....కోవెల మెట్టిన పుత్తడి బొమ్మా,
మా రాముడు వలచిన సీతమ్మా...ఈ లక్ష్మణులకు ఇంకొక అమ్మ!
ఈ మెత్త మనసు గల అత్త మామలకు కొత్త కూతురివి నీవమ్మా,
కలకలలాడగ మా బృందావని కిలకిలలాడవే ఓ చిలకమ్మా!
ప్రేమలు విరబూసిన ఈ కొమ్మా...ఆ...అ...ఆ... //2 //
వాలగ ఏ నోములు నోచితివమ్మా ! .............................................//భలే భలే//

(ముగింపు పల్లవి)

అన్నా వదినలు అన్యోన్యం, సేవింపగ మేమిక ధన్యం.. ..//2 //

కల కాలం విలసిల్లాలి చల్లగ అల్లగ మీ దాంపత్యం,
కలతలు ఎఱుగక మమతలు కురియగ మా లోగిలి విరిసెను స్వర్గం !!

*************************************************